Harmanpreet Kaur: రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అందుకున్న టీమిండియా కెప్టెన్.!

Harmanpreet Kaur: భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా సోమవారం నాడు జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో అందుకున్నారు. ఈ ఏడాది జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 131 మంది పద్మ పురస్కార గ్రహీతల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కూడా ఉంది. భారత మహిళల క్రికెట్ విజయాలకు ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. ముఖ్యంగా 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత్ తొలిసారి మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్ కొత్త శకానికి నాంది పలికింది. 36 ఏళ్ల హర్మన్ ప్రీత్ కు ఇది ఐదవ వన్డే ప్రపంచకప్. గతంలో పలుమార్లు నిరాశ ఎదురైనా, ఈసారి మాత్రం తన నాయకత్వంతో జట్టును విజేతగా నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయింది. పద్మశ్రీ అవార్డు జాబితాలో తన పేరు ఉండటంపై హర్మన్‌ప్రీత్ ఆనందం వ్యక్తం చేసింది. “రాష్ట్రపతి భవన్ నుంచి మా నాన్నకు కాల్ వచ్చింది. ఈ ఏడాది నాకు పద్మశ్రీ అవార్డు వస్తోందని తెలిసింది. ఇది నా జీవితంలో ఎంతో గొప్ప క్షణం. నా కంటే ముందుగా ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిసినందుకు ఇంకా ఆనందంగా ఉంది” అని ఆమె అన్నారు. అలాగే పద్మ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్న భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఆమె అభినందనలు తెలిపింది. రోహిత్ చాలా కష్టపడి పనిచేశాడు. అతనికి కూడా ఈ గౌరవం రావడం ఎంతో ఆనందంగా ఉందని హర్మన్ ప్రీత్ అన్నారు. #WATCH | Delhi | President Droupadi Murmu confers Padma Shri on India women's cricket captain Harmanpreet Kaur for her contributions in the field of Sports (Cricket) (Video source: President of India/Social Media) pic.twitter.com/Rua8xCLznp — ANI (@ANI) May 25, 2026

