India A Squad : ఐపీఎల్ మధ్యలో కేకేఆర్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. అఫీషియల్‌గా ఇండియా టీమ్‌లోకి ఎంట్రీ

India A Squad : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్యాంప్‌లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, జార్ఖండ్ క్రికెటర్ అనుకుల్ రాయ్‌కు ఊహించని విధంగా టీమిండియా పిలుపు వచ్చింది. త్వరలోనే శ్రీలంక వేదికగా జరగబోయే ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఇండియా-ఎ జట్టులోకి అనుకుల్ రాయ్‌ను ఎంపిక చేశారు. గురువారం (మే 21) సెలక్షన్ కమిటీ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ప్రధాన భారత జట్టుకు ఎంపికైన హర్ష్ దూబే స్థానంలో అనుకుల్ రాయ్‌ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారు. హర్ష్ దూబేకు ప్రమోషన్.. అందుకే అనుకుల్ రాయ్‌కు లక్కీ ఛాన్స్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నెల ప్రారంభంలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లే ఇండియా-ఎ జట్టును ప్రకటించింది. అయితే ఆ జట్టులో ఉన్న యువ బౌలర్ హర్ష్ దూబే.. ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరిగే వన్డే, టెస్ట్ సిరీస్‌కు ఏకకాలంలో ఎంపికయ్యాడు. జూన్ నెలలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, అలాగే లంకలో ఇండియా-ఎ ముక్కోణపు సిరీస్ దాదాపు ఒకే సమయంలో జరగనున్నాయి. హర్ష్ దూబే సీనియర్ జట్టుతో ఉండబోతుండటంతో, లంక టూర్‌కు అతని స్థానాన్ని భర్తీ చేయడానికి సరైన ఆటగాడి కోసం చూసిన సెలక్టర్లకు కేకేఆర్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపించాడు. వికెట్లతో చెలరేగిన కేకేఆర్ స్టార్ 27 ఏళ్ల అనుకుల్ రాయ్‌కు లభించిన ఈ అవకాశం వెనుక అతని అద్భుతమైన ఫామ్ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న అనుకుల్.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 వికెట్లు పడగొట్టడమే కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించాడు. దీనికి తోడు 2025-26 దేశవాళీ సీజన్‌లో జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీలో కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 29 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలోనూ 49 సగటుతో, 122 స్ట్రైక్ రేట్‌తో 245 పరుగులు చేసి పవర్‌ఫుల్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. జూన్ 9 నుంచి లంకలో ముక్కోణపు పోరు ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే జూన్ మొదటి వారంలో ఇండియా-ఎ జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్-ఎ మూడో జట్టుగా బరిలోకి దిగుతోంది. జూన్ 9 నుంచి జూన్ 19 వరకు దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో మొత్తం 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టూర్‌కు యువ సంచలనం తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు మోయనున్నాడు. అప్‌డేట్ చేసిన ఇండియా-ఎ పూర్తి జట్టు ఇదే: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్, అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

