క్రీడలు

IPL 2026 Playoffs: 22 రోజులు టాప్‌లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్‌గా ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత!

ntvtelugu
Advertisement
728x90 Banner Ad
IPL 2026 Playoffs: 22 రోజులు టాప్‌లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్‌గా ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత!

Punjab Kings IPL 2026 Points Table: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్రయాణం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టు సీజన్ ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసి వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 22 రోజుల పాటు టాప్‌లో కొనసాగిన పంజాబ్.. చివరకు ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన పంజాబ్ కింగ్స్.. ఆ తర్వాత పూర్తిగా గాడి తప్పింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై తీవ్ర ఒత్తిడిలో పడింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించినప్పటికీ.. 14 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో ఐదో స్థానంలోనే నిలిచి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్‌లో ఎక్కువ రోజులు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన జట్లలో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆర్సీబీ 18 రోజులు టాప్‌లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ 13 రోజులు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 రోజులు అగ్రస్థానంలో నిలిచాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక రోజు మాత్రమే టేబుల్ టాపర్‌గా ఉన్నప్పటికీ.. చివరకు రెండో స్థానంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి క్వాలిఫయర్-1పై పడింది. ఈరోజు ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం లభించనుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ అదరగొట్టింది. దూకుడైన బ్యాటింగ్‌, పటిష్టమైన బౌలింగ్ ప్రదర్శనతో దుమ్మురేపుతోంది. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉండగా.. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అవే మ్యాచ్‌ల్లో గెలిచే సామర్థ్యం ఆర్సీబీకి అదనపు బలంగా మారింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో బౌలింగ్ బలంతోనే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ కొత్త బంతితో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగా.. రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్ మధ్య ఓవర్లలో పరుగులను కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలు అందించారు. చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగుల భారీ విజయంతో జీటీ మంచి జోరులో ఉంది. రెండు సమాన బలాలున్న జట్లు తలపడుతుండటంతో క్వాలిఫయర్-1 అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్‌గా మారే అవకాశముంది.

Advertisement
468x60 Banner Ad
Published on Wednesday, May 27, 2026
← Back to News
IPL 2026 Playoffs: 22 రోజులు టాప్‌లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్‌గా ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత! | Telugu Live24